తెలంగాణ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ..ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నేతలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కలిసి వారి సమస్యలు, పీఆర్సీ నియామకంపై సమగ్రంగా చర్చించాం. తెలంగాణలో రెవెన్యూ పెరుగుదల అద్భుతంగా ఉంది. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఇంజినీర్లు, ఉద్యోగుల విశేష కృషి ఉంది. దేశ స్థాయిలో రాష్ట్రానికి ఎంతో గౌరవం దక్కుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం అధికారులు 24గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వ పాలసీలు, దాన్ని సమర్థతో అమలుచేస్తోన్న ప్రభుత్వ యంత్రాంగమే. కేసీఆర్ కిట్ల వల్ల ప్రభుత్వ వైద్యులపై మూడు రెట్లు పని, బాధ్యత పెరిగింది. ప్రభుత్వ వైద్యుల సేవలను గుర్తించాల్సిందే.. వారిని అభినందించాల్సిందే.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశాం. చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీలో ఉద్యోగులు సెలవులను కూడా త్యాగంచేసి విధుల్లో పాల్గొన్నారు. అన్ని రకాల ఉద్యోగులూ నిబద్ధతతో పనిచేస్తున్నారు. చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయనంత పని మనం చేస్తున్నాం.కొత్త రాష్ట్రమైనప్పటికీ దేశమే ఆశ్చర్యపోయేలా పథకాలు అమలుచేస్తున్నాం. ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ రంగంలో చక్కటి శక్తిసామర్థ్యాలను చూపుతూ ఉద్యోగ వర్గాలు తీసుకెళ్తున్నాయి.వారికి నా అభినందనలు. రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లడంలో ఉద్యోగులదే కీలక పాత్ర. ఉపాధ్యాయుల కృషివల్లే ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడం ప్రభుత్వ నైతిక బాధ్యత. ఉద్యోగుల సమష్టి కృషివల్లే దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.