తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి గ్రామాల్లో అపూర్వ స్పందన వస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . ఖమ్మంలోని తిరుమలాపాలెం మండలం తెట్టెలపాడులో ఈ రోజు మంత్రి రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ… కౌలురైతులను గుర్తించడం అసాధ్యమన్నారు.
పంటసాయం పొందిన రైతులు కౌలు ధర తగ్గించాలని ఆయన సూచించారు. అలాగే పట్టాదారు పాసుబుక్‌ను తాకట్టుపెట్టాలని ఏ బ్యాంకైనా అడిగితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామన్నారు. రైతులకు సంపూర్ణ రుణమాపీ చేశామని..ఇప్పుడు పంటకు పెట్టుబడి కింద ఎకరాకు 8 వేలు ఇస్తున్నామన్నారు.
71 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు చేయని పనిని అన్నదాతల కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. జూన్ 2 నుంచి దేశంలోనే మొదటిసారిగా రైతుల కోసం రూ.5లక్షల భీమాను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు