ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చి మ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్‌కు పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అంతేకాక, జగన్ వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న జిల్లా ప్రజలు అశేషంగా తరలి వచ్చారు. అయితే, ప్రజాదారణతో పాదయాత్రను కొనసాగిస్తున్న జగన్ కు.. పాదయాత్రలో పాల్గొన్న ప్రజలు అర్జీల రూపంలో వారి వారి సమస్యలను జగన్‌కు తెలుపుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే బుధవారం దెందులూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వైసీపీ సమావేశంలో పాల్గొన్న ప్రజలు జగన్‌కు వారి వారి సమస్యలను తెలుపుకుని.. చంద్రబాబు పాలనలో తెలుగు తమ్ముళ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు విన్నవించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న భట్టు రాజు అనే వ్యక్తి మాట్లాడుతూ.. జగన్ అన్నా.. నేను దెందులూరి నివాసిని.. మా ప్రాంత ప్రజలకు ఎస్సీ, క్రైస్తవ కోపరేటివ్ సొసైటీలోని ఏడు చెరువు పరిధిలో ఉన్న 360 ఎకరాల భూమిని గత 30 సంవత్సరాలుగా సాగు చేస్తున్నాం. కానీ, ఇటీవల కాలంలో ఆ భూములపై మా నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కన్ను పడింది. తన అనుచరులతోపాటు.. టీడీపీ కార్యకర్తలను బినామీలుగా చేర్చి ఆ 360 ఎకరాల భూమిలో 228 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారంటూ జగన్‌తో తన ఆవేదనను చెప్పాడు. మీరు అధికారంలోకి వచ్చిన తరువాతైనా ఆ సొసైటీ భూములను అందరికీ చెందేలా చర్యలు తీసుకోవాలని వేడుకొన్నాడు భట్టు రాజు.
వెంటనే స్పందించిన జగన్ చింతమనేని ప్రభాకర్‌పై ఫైరయ్యారు. ఈ అవినీతి కేవలం చింతమనేని ప్రభాకర్‌తో మాత్రమే ఆగలేదని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలంతా ఇలానే తయారంటూ జగన్ విమర్శించారు. సామాన్య ప్రజల భూములను లాక్కోవడం.. ఆ తరువాత తమ ఆర్థికబలంతో సామాన్యలను బెదిరంచడం టీడీపీ నేతలకు మా మూలైపోయిందన్నారు. ప్రజల ఆదరణతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇటువంటి టీడీపీ నేతలందరికీ బుద్ధి చెప్పే బాధ్యత నాదంటూ భట్టు రాజుకు జగన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని జైల్లో పెట్టించే బాధ్యత తనదంటూ జగన్ తెలిపారు.