ఏపీ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నవారు ఒ ఆశ్చర్యకరమైన అంశాన్ని గమనించారు. ఇంకా చెప్పాలంటే ఓ ప్రత్యేక రికార్డ్‌ను కూడా సృష్టించారు. అలా రికార్డ్ సృష్టించింది కూడా ఓ ముగ్గురు ప్రముఖమైన నాయకులు. అది కూడా వేర్వేరు పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలు కావడం. ఆ ముగ్గురే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి,ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఈ ముగ్గురు ప్రస్తుతం ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు సారథ్యం వహిస్తున్నప్పటికీ ఈ ముగ్గురి రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీలోనే.
ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా ప్రజలకు దూరమై ప్రస్తుతం కునారిల్లిపోతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు వేర్వేరు పార్టీల్లో కీలకంగా ఉన్నారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీలోనే అనే సంగతి తెలిసిందే. ఆ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన బాబు అనంతరం తన మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు. ఆయనకే వెన్నుపోటు పొడిచి పార్టీని కైవసం చేసుకున్నారు.
ఇక ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన తండ్రి వారసత్వంతో కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగారు. అనంతరం కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను చేదించి మరి తన తండ్రి అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ,బాధపడుతున్న కుటుంబాలకు అండగా ఉండటానికి ,రాజన్న పాలనను అందించడానికి సోనియా గాంధీని ఎదిరించి మరి సొంత పార్టీ స్థాపించుకున్నారు.ఇక బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడనే సంగతి తెలిసిందే. ఆ పార్టీలో ఒక వెలుగువెలిగిన కన్నా రాష్ట్ర విభజన అనంతరం బీజేపీలో చేరారు. ప్రస్తుతం అధ్యక్షుడు అయ్యారు. స్థూలంగా మూడు భిన్నమైన ఎజెండాలు కలిగిన పార్టీల రథసారథులు కాంగ్రెస్ నాయకులే కావడం విశేషం.