కర్ణాటక ఫలితాల వేళ రాహుల్ గాంధీకి .. చంద్రబాబు ఫోన్ కాల్..!! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు తారక రామారావు అసలు తెలుగుదేశం పెట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కదా..! అటువంటిది ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫోన్ చేయడమేంటి..? అసలు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని ఎందుకు కలవాలనుకుంటున్నారు..? ఏపీలో 2014లో అధికారం చేపట్టి.. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ఏం వ్యూహం రచిస్తోంది..? చంద్రబాబుతో రహస్య భేటీకి రాహుల్ గాంధీ సహకరిస్తారా లేదా..? కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారానికి చంద్రబాబు నాయుడు ఖర్చు చేసిన వేలకోట్ల రూపాయల సంగతేంటి..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే..!!
నేడు విడుదలైన కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 2 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే, అంతకు ముందు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగానైనా తన అనుచర వర్గం, ఆఖరికి ఏపీ ఉద్యోగ సంఘం నేతగా ఉన్న అశోక్‌బాబును సైతం వదలకుండా అందరినీ కర్ణాటకలో ప్రచారం చేసేందుకు పంపించారంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కోడై కూసింది. ఆ విషయాన్ని నిజం చేస్తూ అశోక్‌బాబు మీడియా సాక్షిగా కర్ణాటకలో దొరికిపోయారు. అయితే, అశోక్‌బాబు పాల్గొన్న సమావేశం గందరగోళం మధ్య అర్ధాంతరంగా ముగిసిందనుకోండి.. అది వేరే విషయం.
అసలు విషయానికొస్తే.. బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 2 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నా.. ఎవరికీ కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఫోన్ చేసిన చంద్రబాబు జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకోనైనా.. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, బీజేపీ కనుక అధికారం చేపడితే నీ పార్టీతోపాటు (కాంగ్రెస్) నా పార్టీ (తెలుగుదేశం) నామరూపాలు లేకుండా పోతుందని రాహుల్ గాంధీకి, చంద్రబాబు ఫోన్‌లో తెలియజేశారు. అంతేకాక, కర్ణాటకలో నేను ఖర్చుపెట్టిన నగదు, పడ్డ కష్టం అంతా వృథా అయిపోతుందనే అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు త్వరలో మిమ్మల్ని (రాహుల్ గాంధీ) కలుస్తాను.. మీరు వీలు చూసుకుని నాకు కబురంపండి అంటూ చంద్రబాబు నాయుడు తన ఫోన్ కాల్ చివర్లో రాహుల్ గాంధీతో మాటా మంతి కలిపారు.
ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఓ పక్క కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడి.. రాజకీయ వేడిని పెంచిన నేపథ్యం.. మరో పక్క కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయంటూ వస్తున్న వార్తలు పై కథనానికి బలం చేకూర్చుతున్నాయి.