కర్ణాటక సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. ఇందుకు కారణం కర్ణాటకలో బీజేపీ విజయ ఢంకా మోగించడమే. కర్ణాటకలో బీజేపీకి అత్యధిక సంఖ్యలో సీట్లు గెలవడంతోపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బాధ పడుతుందో తెలీదు కానీ.. ఇటీవల కాలంలో జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం దుఃఖ సంద్రంలో మునిగి తేలుతున్నారు.
అయితే, ఇటీవల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం ఆధారాలను సేకరించి త్వరలో ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకునేందుకు రంగం చేసుకుందంటూ సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన చంద్రబాబు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలవనీయమంటూ పలు మీడియా, పత్రికల ముఖంగా ముక్తకంఠంలో చెప్పారు. అంతే కాకుండా, కర్ణాటకలోని తెలుగు సంఘాల వారితో సంప్రదింపులు జరిపి మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా, బీజేపీ దక్షిణ భారతానికి వ్యతిరేకమని భావనను కల్పించేలా చంద్రబాబు పావులు కదిపారు.
అయితే, చంద్రబాబు ఊహించని రీతిలో.. ప్రజలు ఊహించిన విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది. అన్ని పార్టీలకంటే బీజేపీ అత్యధిక సీట్లను గెలుపొందింది. దీంతో బీజేపీనే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించిన చంద్రబాబుపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..? 2014 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు హయాంలో ఏపీలో జరిగిన అవినీతి కార్యకలాపాలను బయటకు తీసి చంద్రబాబును జైలుకు పంపుతుందా..? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ.. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి మోడీ సర్కార్‌కు షాక్ ఇవ్వాలనుకున్న చంద్రబాబుకు రానున్న రోజుల్లో గడ్డుకాలం తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.