ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణయంతో ఆందోళనలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్. అవును, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వైద్య వృత్తిలో ఉన్న కోడెల శివ ప్రసాద్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్నుంచి ఇప్పటి వరకు కోడెల శివ ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్నారు.
అటువంటి కోడెల శివ ప్రసాద్ ప్రస్తుతం గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్నారు. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్‌కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన మద్దతుతో స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
అయితే, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. స్పీకర్ కోడెల కుటుంబం అటు నర్సారావుపేట, ఇటు సత్తెనపల్లి నియోజకవర్గాల్లో భారీస్థాయిలో అవినీతికి పాల్పడటమే ఇందుకు కారణం. సామాన్య ప్రజల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు, కాంట్రాక్టర్లను సైతం వదలకుండా కోడెల ఫ్యామిలీ వారిపై దాడులను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా, భూ కబ్జాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నది కోడెల కుటుంబంపై ఉన్న ప్రధాన ఆరోపణ. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి కోడెల ఫ్యామిలీ అరాచకాలు తారా స్థాయికి చేరాయన్నది ఆ రెండు నియోజకవర్గాల ప్రజల మాట.
ఇలా కోడెల శివప్రసాద్‌పై అవినీతి, నేరారోపణలు రావడంతో స్పీకర్ స్థానం నుంచి తప్పించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారని టీడీపీ వర్గాల సమచారం. అందులో భాగంగానే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ కార్యాచరణలో ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు చంద్రబాబు. అయితే, ఎప్పట్నుంచో టీడీపీనే నమ్ముకుని ఉన్న కోడెల శివప్రసాద్‌కే ఈ గతి పడితే.. మా పరిస్థితి ఏంటని కొందరు టీడీపీ నేతలు ప్రశ్నించుకుంటున్నారు. అందులో వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఉండటం గమనార్హం. అంటే..!! అసెంబ్లీని సజావుగా నడిపించగలిగే ఆ కొత్త స్పీకర్ ఎవరన్నది మరికొద్ది రోజుల్లో తేలనుందన్నమాట.