కీర్తి సురేష్ కీర్తి చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన సినిమా మహానటి. దివంగత నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేసింది. ఈ సినిమా తరువాత సావిత్రి అంటే కీర్తి సురేష్ అనేలా చిత్రంలో నటించింది. అయితే, ఈ సినిమాలో తాను పడ్డ కష్టాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కీర్తి.
తెలుగు ప్రేక్షకులు మహానటి సావిత్రిని దేవతలా ఆరాధిస్తారని, అటువంటి పాత్రను తాను పోషించడానికి ముందు చాలా సందేహించానని చెప్పింది. అయితే, దర్శకుడు ముందుండి నడిపించడం వల్లే సావిత్రి పాత్రలో నటించ గలిగానని తెలిపింది. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందని, ఈ పాత్ర కోసం తాను బరువు పెరగలేదని, నిజం చెప్పాలంటే సావిత్రి చిన్న నాటి పాత్ర కోసం కాస్త బరువు తగ్గాల్సి వచ్చిందని, సావిత్రి పెద్దయ్యాక తాను పోషించాల్సిన పాత్రలకు తనకు మేకప్ వేసేవారని, మూడు గంటల సమయం పట్టేదని చెప్పింది. ఆ మేకప్‌ను తిరిగి తీసేసేందుకు మళ్లీ మూడు గంటల సమయం పట్టేదని చెప్పిన కీర్తి సురేష్.. కేవలం తన కను బొమ్మలను సావిత్రిలా తీర్చిదిద్దేందుకే అరగంట సమయం పట్టేదని చెప్పింది.
మేకప్ వేసే మూడు గంటలూ ఏమన్నా తిందామన్నా.. నోరు తెరిచేందుకు వీలుండేది కాదని చెప్పిన కీర్తి సురేష్ సెట్స్‌పైకి వెళ్లగానే ఆ కష్టమంతా మరిచిపోయి పాత్రపై, నటనపై దృష్టి పెట్టేదానినంటూ చెప్పుకొచ్చింది.