ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం కైకలూరు నుంచి బయలుదేరి కృష్ణా జిల్లా సరిహద్దులోని పెదయడ్లగాడి వంతెన వద్ద పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్ జగన్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఏలూరులో రెండువేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్ జగన్ దాటనున్నారు. రెండువేల కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఏలూరు మండలం వెంకటాపురం దగ్గర నిర్మించిన 40 అడుగుల పైలాన్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 250 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టిన జననేత వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. జిల్లాలో అడుగుపెట్టిన జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చి.. వైఎస్ జగన్ అడుగులో అడుగు వేసి కదిలారు. భారీగా పార్టీ నేతలు, శ్రేణులు, జనం తరలిరావడంతో వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.