తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిష్టాత్మకమైన పథకాలవైపు కేంద్రప్రభుత్వం ఆసక్తిగా చూస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరులో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న పథకాల వైపు కేంద్రం ఆసక్తిగా చూస్తోందని చెప్పారు. రైతులకు ఎదురయ్యే చిన్న సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయ సమితులు కృషి చేయాలని.. రైతులు పండించే పంటకు మద్దతు ధర దక్కాలి అని తెలిపారు. ఆలూరును మండల కేంద్రంగా చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరుతామన్నారు. ఆలూరులో సీసీరోడ్ల నిర్మాణం కోసం రూ. 2 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మహిళా సంఘం భవన నిర్మాణానికి రూ. 15 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.