టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతులకు ఏం చేయడానికైనా సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్, ముక్కుడుదేవులపల్లి గ్రామాల్లో రైతులకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి జగదీశ్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
రైతుబంధు పథకానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారని, గ్రామాల్లో ఎక్కడ చూసినా ఆనందోత్సాహాలతో ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. నేను తెలంగాణలో రైతును అని గర్వంగా చెప్పుకుంటున్నారని తెలిపారు. చెక్కులు చేతపట్టుకొని రైతులు ఆనందభాష్పాలతో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని మంత్రి అన్నారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని దేశంలోని ప్రతి రైతు కోరుకుంటున్నాడని చెప్పారు. ఆర్ధిక వేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పెట్టుబడి పథకాన్ని కొనియాడుతున్నారని తెలిపారు.