ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసమే రైతు బంధు పథకాన్ని తెచ్చారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నర్సుల్లా బాద్‌లో గ్రామంలో రైతు బంధు పథకం కింద రైతులకు పట్టా పాసు పుస్తకాలు, పంటల పెట్టుబడి చెక్కుల ను మంత్రి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఒక రైతుగా రైతుల సమస్యలు బాగా తెలిసిన వాడిగా సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉన్నారన్నారు.
రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. పంటలకు నీరు, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులు, విద్యుత్ లేకుండా రైతులు ఉండలేరన్నారు . అందుకే సిఎం కేసీఆర్, మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల మరమ్మత్తులకు పూనుకున్నారన్నారు. 24 గంటలపాటు విద్యుత్‌ని ఇస్తున్నారని చెప్పారు. విత్తనాల లైన్లు, చెప్పులు పెట్టి బయటకు వెళ్ళే దుస్థితి నుంచి కాపాడుతూ, రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులోకి తెచ్చారన్నారు.
ఇక పంటల పెట్టబడుల కోసం మిత్తీలకు తెచ్చిన డబ్బులు కట్టడానికే పంటలు సరిపోని దుస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడటానికే పంటల పెట్టుబడులను ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించారన్నారు. అందుకే రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు రూ.8వేలు అందిస్తున్నారని మంత్రి వివరించారు. త్వరలోనే ప్రాజెక్టులు పూర్తి అయితే రైతాంగానికి భూ ఉపరితల నీరు పంటలకు అందుతాయన్నారు. మూడు పంటలను పండించే స్థాయికి తెలంగాణ రైతుని తీసుకెళ్ళాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. అలాంటి సీఎంని కలకాలం రైతులు, ప్రజలు ఆదరించాలని మంత్రి కోరారు.