వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజాదారణ నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే ఏపీలోని ఏడు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరో పక్క జగన్ పాదయాత్ర ఆద్యాంతం అధికార టీడీపీకి చెందిన నేతల నుంచి కార్యకర్తల వరకు ఎక్కువ సంఖ్యలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాక, కృష్ణా జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి అత్యధిక సంఖ్యలో వలసల పర్వం కొనసాగింది. 2019లో కృష్ణా జిల్లా వైసీపీ అడ్డా అనేంతలా వలసల పర్వం కొనసాగడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన వైసీపీ సభలో జగన్‌కు ఓ సామాన్య వ్యక్త ప్రశ్నల వర్షం సంధించారు. దళితుల తరుపున వైఎస్ జగన్‌కు నా హృదయపూర్వక నమస్కారాలంటూ ప్రశ్నలను ప్రారంభించిన రవిరాజు అనే వ్యక్తికి జగన్ నుంచి ఊహించినదానికంటే.. ఎక్కువ సంతోషపడే సమాధానం లభించింది.
అవేమిటంటే..!!
రవిరాజు మాట్లాడుతూ.. దళితులకు నిజమైన స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందంటే ఆర్థికంగా ఎదిగినప్పుడే.. అప్పుడే ధైర్యంగా సమాజంలో జీవించగలుగుతారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు అసైన్డ్ భూములను పంపిణీ చేస్తారా..? అని ప్రశ్నించారు.
అందుకు స్పందించిన వైఎస్ జగన్ సమాధానమిస్తూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం భూములు వారి అత్తగారివి లాగా భావిస్తూ పేదల నుంచి లాక్కుంటున్నాయని, వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం.. దళితుల హక్కులు కాపాడేలా.. వారికి ఇచ్చిన భూములు వారికే చెందేలా బలోపేతమైన చట్టాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ఆ భూములు ప్రభుత్వానికి అవసరపడితే.. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎలా అయితే ఎక్కువ నగదు ఇచ్చి కొంటామో.. అదే విధంగా దళితుల నుంచి కూడా ఎక్కువ నగదు ఇచ్చి కొంటామని జగన్ చెప్పారు.
దళితులంతా ఐక్యంగా ఉండాలని మీరు చెప్పారు బాగుందీ.. కానీ, మీరు అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదువులను దళితులకే ఎక్కువ సంఖ్యలో ఇస్తారా..? అని రవిరాజు ప్రశ్నించగా.. స్పందించిన జగన్ మాట్లాడుతూ..
దళితులంతా ఐక్యంగా ఉండాలి. అది ఇప్పుడే కాదు.. ఎప్పటికీ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాత్రం నువ్వు చెప్పినట్టుగానే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రతీ పేదవాడి మొఖంలో చిరునవ్వు చూసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.