ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేశారు. బీజేపీ, వైసీపీ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని టీడీపీ విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అందుకు సాక్ష్యం అన్నట్టు కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప, విజయసాయిరెడ్డి కలిసి చర్చించారంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలోకి వదిలారు. పగలు ఏపీలో ఉంటున్న విజయసాయిరెడ్డి రాత్రి వేళల్లో కర్ణాటకకు వెళ్లి బీజేపీ నేతలను కలుస్తున్నారని, వీలు ఉన్నప్పుడల్లా అక్కడకు వెళ్లి బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్నారని ఈ ఫోటో ద్వారా నెటిజన్లను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ వాళ్లు. దీని వెనుక టీడీపీ హస్తముందన్నది జగమెరిగిన సత్యమని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమన్న విషయం ఫోటోను బట్టి ఇట్టే తెలిసిపోతుందంటున్నారు వైసీపీ శ్రేణులు.
సదరు ఫోటోలో విజయసాయిరెడ్డి క్లీన్ షేవ్ చేసుకొని ఉన్నారు. కానీ, విజయసాయిరెడ్డి గడిచిన ఆరు నెలలుగా పెరిగిన గడ్డంతోనే ఉన్నారు. ఇప్పుడు విశాఖలో పాదయాత్ర కూడా చేస్తున్నారు. అయితే, ఈ లాజిక్‌ను మరిచిపోయిన టీడీపీ వాళ్లు అత్యుత్సాహంతో ఎక్కడి ఫోటోలనో తెచ్చి సోషల్ మీడియాలో అతికించేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరు నెలలుగా పెరిగిన గడ్డంతోనే ఉన్న విజయసాయిరెడ్డి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో క్లీన్ షేవ్‌లో యడ్యూరప్పను ఎలా కలిశారో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని వైసీపీ శ్రేణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.