సినీ నటుడు సాయి కుమార్ గతంలో ఒకసారి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు. అయితే, ప్రస్తుతం కర్ణాటకలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న సాయి కుమార్ ఈ సారి కచ్చితంగా గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి కుమార్ మాట్లాడుతూ.. అటు కర్ణాటక ప్రభుత్వంతోపాటు.. ఇటు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సాయి కుమార్.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అయితే పాలకులు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను తమ రాజకీయ భవిష్యత్తుకు అనుకూలంగా మలుచుకుంటున్నారని విమర్శించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు కొత్తరాష్ట్రంలో హైదరాబాద్‌ను తలదన్నేలా రాజధానిని కడతానని చెప్పారని, ప్రత్యేక హోదా తెస్తాని చంద్రబాబు ఇచ్చిన హామీని సాయి కుమార్ గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితులనుబట్టి చూస్తే చంద్రబాబు అమరావతిలో అధికారులకు సంబంధించిన ఒక స్థిరమైన భవనాన్ని కూడా కట్టలేక పోయారని ఎద్దేవ చేశారు. అలాగే, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎన్నిమార్లు మాటలు మార్చారో ప్రజలందరికీ తెలుసని, ఒక సారి ప్రత్యేక హోదా సంజీవని కాదని, మరో సారి కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటాదా..? అంటూ చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్న సంఘటనలను సాయికుమార్ మీడియా సాక్షిగా మరో మారు గుర్తు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాత్రం ప్రత్యేక హోదా విషయంలో ఒకే మాట మీద ఉంటూ ప్రజల తరుపున పోరాడుతున్నారన్నారు. అందులోనూ జగన్ చేస్తున్న పాదయాత్రలో ప్రజల ఆదరణను చూస్తుంటే.. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలను గుర్తు చేస్తుందన్నారు. భవిష్యత్ చూస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు.