సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు. మీడియా సంస్థలు ఇతర స్వతంత్ర సంస్థలు ఎన్ని సర్వేలు చేసినా అవి అటోఇటో ఉంటున్నాయి. అయితే లగడపాటి సర్వే మాత్రం ఏమాత్రం పొల్లుపోకుండా అంచనా వేస్తుంటుంది. అందుకే ఆయన సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నాటక పీఠం ఎవరికి దక్కబోతోందనేదానిపై కూడా లగడపాటి సర్వే చేశారు.
కర్నాటకలో హోరాహోరీ పోరు నడుసోంది. అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి పీఠం దక్కించుకునేందుకు అన్ని విధాలా ట్రై చేస్తోంది. ఇందుకోసం రాహుల్ గాంధీతోపాటు, సోనియాను కూడా రంగంలోకి దింపి ప్రచారం చేయించింది. మరోవైపు దక్షిణాదిలో తాము కోల్పోయిన పట్టును మళ్లీ దక్కించుకునేందుకు కర్నాటకయే సరైన మార్గమని బీజేపీ భావిస్తోంది. గతంలో అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ చేజేతులా పోగొట్టుకుంది. అయితే ఈసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోంది. గెలుపుకోసం రెండు పార్టీల మధ్య ఊగిసలాడుతున్న నేపథ్యంలో లగడపాటి సర్వేపై అందరి కళ్లూ పడ్డాయి. అయితే లగడపాటి మాత్రం ఈసారి సర్వే ఫలితాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ లగడపాటి తన రెగ్యులర్ సంస్థతో కలిసి సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం ఈసారి కర్నాటకలో గెలుపు బీజేపీదేనని స్పష్టం చేశారు. ఆ పార్టీకి 110-120 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్ కు 70-80, జేడీఎస్ కు 40వరకూ సీట్లు దక్కుతాయని తేల్చారు. కొంతకాలం వరకూ కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆ పార్టీ వెనుకబడిందని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని లగడపాటి సర్వే జోస్యం చెప్పింది. అయితే ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడించేందుకు లగడపాటి నిరాకరించారు.
