కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.జూన్ 2వ తేదీ రాష్ట్రంలో మరో విప్లవం రాబోతుందని.. ఎమ్మార్వో ఆఫీసుల్లోనే ఇక నుంచి భూ రిజిస్ట్రేషన్స్ జరగనున్నట్లు ప్రకటించారు. ప్రతి మండల కేంద్రంలోనే భూ మార్పిడికి సంబంధించి అన్ని వ్యవహారాలూ జరుగుతాయన్నారు.
ఎమ్మార్వో ఆఫీస్ లో పైసా ఖర్చు లేకుండా భూమి అమ్మకం, కొనుగోలు మార్పిడి జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్, ఈసీలకు పైరవీలు అవసరం లేదన్నారు. రెండు గంటల్లో పాస్ బుక్ లోనూ భూ మార్పిడి జరిగిపోతుందన్నారు. 48 గంటల్లోనే ఆయా పత్రాలు పోస్టు ద్వారా రైతు ఇంటికి రాబోతున్నాయని అన్నారు.
ఇక నుంచి బ్యాంకుల్లో అప్పు కోసం రైతులు తమ పాస్ పుస్తకాన్ని తనఖా పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ధరణి అనే వెబ్ సైట్ ద్వారా భూములన్నీ పక్కాగా ఆన్ లైన్ అయిపోతుందన్నారు.భూమి లావాదేవీలు అన్నీ కూడా ధరణి వెబ్ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయటం జరుగుతుందని.. బ్యాంకులకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.