రైతుబంధు పథకం తెలంగాణ రైతు ఆత్మగౌరవానికి నిదర్శనం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారతదేశంలోనే ఇవాళ సువర్ణ అధ్యాయమని చెప్పారు .కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
అప్పుల కోసం బ్యాంకులు, వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేపట్టిన ఈ రైతు బంధు పథకం ప్రపంచానికే తలమానికంగా అభివర్ణించారు. వానాకాలంలో పంట పెట్టుబడి కోసం ఇప్పటికే రూ.6 వేల కోట్లు బ్యాంకుల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. బడ్జెట్ లో ఇందుకు కావాల్సిన రూ.12వేల కోట్ల రూపాయలను కేటాయించటం ద్వారా.. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి చేస్తోందో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సాయంతో రైతులు బంగారు పంటలు పండిచాలని పిలుపునిచ్చారు. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు, చెక్కులు స్వయంగా అందించారు సీఎం కేసీఆర్.
కరెంట్ కోతలు లేవు.. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం.. విత్తనాల కొరత లేదు.. ఎరువుల కోసం క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం.. పెట్టుబడి కింద డబ్బులు ఇస్తున్నాం అని.. సాగు కోసం అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం ఇదొక్కటే అన్నారు. దేశానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుందన్నారు. కౌలు రైతులకు విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని.. భూమి ఉన్న రైతులకే నగదు ఇవ్వటం జరుగుతుందన్నారు. భూమి ఎవరిపేరున అయితే ఉంటుందో వారికి చెక్కు ఇస్తాం అని స్పష్టం చేశారు సీఎం.