పంటల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే రైతన్నలను ఆదుకోడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరుగాలం శ్రమించి పండించే పంట మొత్తం వడ్డీలు చెల్లించడానికే సరిపోవడంతో నిరాశలో కూరుకుపోయిన రైతులకు భరోసా కల్పించడానికి కేసీఆర్ సర్కారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది.అందులోభాగంగానే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు కరీంనగర్ తెలంగాణ భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరారు.సుమారు 500కు పైగా భారీ వాహనాలతో హుజురాబాద్ బయలుదేరారు.ఈ రోడ్ షో లో భాగంగా సీఎం కేసీఆర్ కు అలుగునూరు, మనకొండూర్, శంకరపట్నం, హుజురాబాద్ మండల కేంద్రాల పరిధిలో స్వాగతం పలికేందుకు రైతులు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ, కోలాటం, వివిధ కళారూపాలతో సీఎంకు స్వాగతం పలకనున్నారు.