తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీతో పాటు జీహెచ్ఎంసీలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచుతామన్నారు. ప్రైవేటు సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు.
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బి.వై.డి. ఆటో ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. నూటికి నూరుశాతం బ్యాటరీతో నడిచే వాహనాల తయారీ పరిశ్రమను స్థానిక కంపెనీలతో కలిసి హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు తెలిపారు. చైనా బయట పరిశ్రమ నెలకొల్పడం ఇదే ప్రథమమని కూడా చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
నగరాలు, పట్టణాల్లో వాహనాలు వెదజల్లే కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నదని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తప్పనిసరి అని చెప్పారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని క్రమంగా పెంచుతామని, మొదటి దశలోనే 500 వాహనాలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఎక్కువ అవకాశం, ఆవశ్యకత ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.
రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్టీసీ ఎండి రమణారావు, బి.వై.డి. జనరల్ మేనేజర్ లియూ జూలింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాంగ్ జీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.