భారతీయ యానిమేషన్ రంగంలో సంచలనం సృష్టించిన ‘చోటా భీమ్’ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన దశాబ్ధి వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నేను చోటా భీమ్ అభిమానిని. నాకు అందులోని పాత్రలన్నీ బాగా నచ్చాయి’ అన్నారు. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సృష్టించిన చోటా భీమ్ ప్రోగాం పిల్లల్నే కాకుండా కుటుంభాన్నంతా అలరించిందన్నారు. టీవీలు, సినిమాలు, ఇంటర్నెట్, యూట్యూబ్‌లో పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో అని ఆందోళన చెందే తల్లిదండ్రులు సైతం చోటా భీమ్‌లాంటి కార్యక్రమాల విషయంలో స్వేచ్ఛని ఇవ్వగలిగారన్నారు.
ఈ పదేళ్లలో గ్రీన్ గోల్డ్ గ్లోబల్ దృష్టితో ముందుకు సాగిందని కానీ ఇంకా చేయాల్సిందని చాలా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. యానిమేషన్ రంగంలో మనదైన డిస్నీని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి ఇండియన్ నమూనాను ప్రపంచానికి అందించాలని, హైదరాబాద్ స్టార్టప్‌గా ఆ కృషిని గ్రీన్ గోల్డ్ సంస్థ చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం యానిమేషన్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు పెద్దపేట వేస్తోందని, 16 లక్షల చదరపు అడుగులో నిర్మించబోయే ఇమేజ్ టవర్స్ ప్రపంచంలో పెద్దదవుతుందన్నారు. గ్రీన్ గోల్డ్ సంస్థ చేనేతను ప్రోత్సహించాలని, తద్వారా ఆరంగంలో పనిచేసే వారికి మేలు జరుగుందని సూచించారు.
గ్రీన్‌గోల్డ్ యానిమేన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రాజీవ్ చిలక మాట్లాడుతూ 2008లో పోగో టీవీ ద్వారా తొలిసారి చోటా భీమ్ ప్రసారమైందని, ఈ పది సంవత్సరాల్లో దేశ విదేశాల్లో చోటా భీమ్‌కి ఎంతో ఆధరణ లభించిందన్నారు. ఇప్పటి వరకు 16వేల నిమిషాల కంటెంట్‌ని ప్రేక్షకులకు ఇవ్వగలిగామన్నారు. దేశంలోని కోట్లాది మంది చిన్నారులను మెప్పించేలా చోటా భీమ్ ఎపిసోడ్స్‌ని ప్లాన్ చేస్తున్నామన్నారు. చోటా భీమ్ ఒక బ్రాండ్‌గా మారి వేరు వేరు ఉత్పత్తుల సృష్టికి దారులేసిందన్నారు. త్వరలో నెట్‌ఫ్లిక్స్ ద్వారా ‘మైటీ లిటిల్ భీమ్’ సిరీస్‌ని ప్రసారం చేయనున్నామని, తద్వారా 190 దేశాల్లో ప్రేక్షులకు చోటా భీమ్ చేరువ కానున్నాడని తెలిపారు. రాబోయే సిరీస్ ‘కుంగ్‌ఫూ దమాఖ’లో చోటా భీమ్ ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం కానున్నాడన్నారు. ఈ సందర్భంగా చోటా భీమ్ ఆటపాటలతో అలరించాడు. యానిమేషన్ రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారనుందని, యానిమేషన్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం ప్రపంచంలోనే అతి పెద్ద సెంటర్‌ను నెలకొల్పనున్నామని అన్నారు.