వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఆయన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లను దాటనుంది. ఈ నెల 14వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు దాటుతుండటంతో వైసీపీ నేతలందరు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే జగన్ ప్రతి వేయి కిలోమీటర్లకు ఒక పైలాన్ ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.అందులోభాగంగానే అక్కడ భారీ పైలాన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అయితే జగన్ రెండు వేల కిలోమీటర్ల పాదయాత్రకు విశిష్టత ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్రగా వచ్చి కామవరపు కోటలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. 2013 మే 14న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రగా వచ్చి బహిరంగసభలో పాల్గొనడాన్ని పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాయి.
జగన్ పాదయాత్ర కూడా అదే రోజు రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. దీంతోపాటు జగన్ సోదరి షర్మిల పాదయాత్ర కూడా పశ్చిమగోదావరి జిల్లా రావికంపాడు వద్ద రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర దాటింది. ఈవిషయాలన్నింటినీ గుర్తు చేసుకుని మే 14వ తేదీ కోసం పెద్దయెత్తున వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.