తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయింది. మరో కీలక ముందుడుగు పడింది. ఎయిమ్స్ ఏర్పాటు, స్థల పరీశీలన కోసం కేంద్రం ఓ కమిటీని నియమించింది. త్వరలోనే ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు కేంద్రం రాష్ట్రానికి పంపిన లేఖలో పేర్కొంది. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశనం, రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ లో చేసిన ప్రయత్నాల ఫలితంగా తెలంగాణ వచ్చిన ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా నడుస్తున్నది.
కొద్ది రోజుల క్రితమే ఎయిమ్స్ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేస్తూ ఎంసిఐ కేంద్రానికి సిఫారసు చేయడం, వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడమేగాక, ప్రక్రియను వేగం చేసింది. నిర్ణీత పద్ధతుల్లో స్థల పరిశీలనకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం చూపించే స్థలాలను పరిశీలించి అనువైన స్థలాన్ని ఎంపిక చేసి, నిర్ణయించనుంది.
దీంతో ఎయిమ్స్ ఏర్పాటు మీద రాష్ట్ర ప్రభుత్వం తరపున జరగాల్సిన ప్రక్రియను కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు.