ఇప్పటికే చిక్కి శల్యమై..భవిష్యత్ మృగ్యమై పోయిన తెలంగాణ టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో కోరుట్ల టీడీపీ ఇంచార్జి సాంబారి ప్రభాకర్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. వారందరికి ఎంపీ కవిత గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో మేము సైతం భాగస్వాములం అవుదామని పార్టీలో చేరిన ప్రభాకర్, ఆయన అనుచరులకు అభినందనలు తెలిపారు. కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ శకం ముగిసిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలనే ఉద్దేశంతోనే తాను గులాబీ గూటికి చేరుతున్నట్లు వివరించారు.