ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని పశ్చిమ గోదావరి జిల్లాలో దాటుతుండటం తమ ప్రాంత అదృష్టమని వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి తలశిల రఘురాంతో కలసి 2 వేల కిలోమీటర్ల పైలాన్ పనులను ఆయన పర్యవేక్షించారు.
ఈ నెల 14వ తేదీ వైసీపీ అభిమానులకు అతి ముఖ్యమైన రోజని తెలిపారు. 15 సంవత్సరాల క్రితం 2003 మే14న పాదయాత్రలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లాలోని కామవరపుకోటలో భారీ సభ నిర్వహించారు. అదే రోజున వైఎస్ జగన్ 2000 కి.మీ పాదయాత్రను పశ్చిమగోదావరిలో పూర్తి చేసుకుని ఏలూరు బహిరంగ సభలో పాల్గొనబోతున్నారని వెల్లడించారు. వైఎస్సార్ తనయ షర్మిల సైతం పశ్చిమగోదావరి జిల్లా రావికంపాడు వద్ద 2 వేల కిలోమీటర్లు మైలురాయిని దాటారని గుర్తు చేశారు. ప్రజాసంకల్పయాత్రతో విచ్చేస్తున్న వైఎస్ జగన్ కోసం జిల్లా ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పారు.