వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ప్రస్తుతం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో 154వ రోజు కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అడుగడుగునా జగన్ తన పాదయాత్ర ద్వారా నడిచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ స్వయంగా తెలుసుకుని.. సమస్యలను పరిష్కార మార్గాలను అన్వేశిస్తూ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్.
ఇదిలా ఉండగా. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అయితే, జగన్ మొండివాడు కదా..? తాను చెప్పిందే వేదమంటూ.. ఆ విషయాలనే తన అనుచరులతోపాటు ఎమ్మెల్యేలపై రుద్దేందుకు యత్నిస్తుంటారు కదా..? అందుకనే వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారట కదా..? అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.
వైసీపీని వీడిన ఎమ్మెల్యేలు టీడీపీలో ఎందుకు చేరారో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా, టీడీపీలో చేరిన వారిలో కొందరు వారి పై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేయించుకునేందుకు కాగా, మరికొందరు చంద్రబాబు చూపిన డబ్బు మూటలను చూసి వెళ్లారని పేర్కొన్నారు. జగన్ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా.. ఒక మానవతా వాదిగా ప్రతీ ఒక్కరికి నచ్చుతారన్నారు. వైసీపీ నేతల నుంచి కార్యకర్తల వకు ప్రతీ ఒక్కరిని అమ్మా, అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించడం జగన్ వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. జగన్ ఒక్కడే కాదు.. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా ప్రతీ ఒక్కరిని తమ వారిగా భావిస్తారన్నారు. మర్యాదలు చేస్తారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే రోజా.
ఇక జగన్ మొండితనమంటారా..? అవును వైఎస్ జగన్ మొండివాడే.. అందుకే.. కాంగ్రెస్ నేత శంకర్రావు, టీడీపీ దివంగత నేత ఎర్రంనాయుడు అక్రమంగా పెట్టిన కేసులను సైతం నిజాయితీగా ఎదుర్కొని నిలిచిన వాడిగా జగన్ మొండిఘటమన్న పేరును పొందారన్నారు. అయితే, శంకర్రావు, ఎర్రంనాయుడు పెట్టిన కేసులన్నీ కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసులన్న విషయం అందరికి తెలిసిందే.