రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 10న ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రారంభిస్తారు. అదే రోజు ఉదయం 11:15 గంటలకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7:30 వరకు నిర్వహిస్తారు.
చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కేంద్రాల వద్ద టెంట్లు వేయాలని, మంచి నీటి సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలకు చేరిన పాస్ పుస్తకాలు, చెక్కులను పరిశీలించి గ్రామాల వారిగా పంపించాలని చెప్పారు. ఏ గ్రామంలో ఏ రోజు కార్యక్రమం ఉంటుందో కూడా స్థానికంగా అందరికీ తెలపాలని అధికారులను కోరారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రులతో పాటు అధికారులు కార్యక్రమం జరిగే రోజుల్లో గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షించాలని చెప్పారు.