తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై గుడ్డి ద్వేషంతో ఆయన్ను ఇరకాటంలో పెట్టాలనే కుట్రతో ఓటుకునోటు కుట్రకు దిగి అడ్డంగా బుక్ అయిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన ఎత్తుగడల కోసం ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చేరువ అయిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించినప్పటికీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని రేవంత్ ఆ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆయనకు కాంగ్రెస్ చుక్కుల చూపించడం మొదలుపెట్టింది.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ప్రచార కమిటీ పదవిని కట్టబెట్టనుందని రేవంత్ వర్గం డబ్బా కొట్టుకుంది. అయితే ముందుగా హామీ ఇచ్చిన ఆ పదవిని ఇవ్వకుండా కాంగ్రెస్ షాకిచ్చింది. అంతేకాకుండా కొద్దికాలం క్రితం ఆయన పాదయాత్రకు కూడా బ్రేకులు వేసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకుంటే అదిష్టానం అందుకు నో చెప్పింది. వ్యక్తిగత పాదయాత్రలు వద్దని అధినేత రాహుల్‌గాంధీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో షాక్ తినడం రేవంత్ వంతు అయింది. ఇలా రేవంత్ దూకుడుకు బ్రేకులు వేసేలా చేసిన కాంగ్రెస్ అవకాశాలన్నీ వాడుకుంది.
అయితే ఎట్టకేలకు రేవంత్ రెడ్డి గౌరవించకపోయినా…కాంగ్రెస్ పార్టీ గుర్తించింది! రేవంత్ రెడ్డితో పాటుగా పార్టీ మారిన వర్గం నాయకురాలు వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డి అనసూయ(సీతక్క)ను కాంగ్రెస్ జాతీయ మహిళా విభాగం ప్రధానకార్యదర్శిగా కాంగ్రెస్‌పార్టీ నియమించింది. దీంతో ఆయన టీం ఊపిరి పీల్చుకుంటోంది. అయితే రేవంత్ రెడ్డిలో మాత్రం అనుమానం మొదలైందని అంటున్నారు. పార్టీలో చేరిన ఇన్నాళ్లకు అది కూడా తనకు కాకుండా తన వర్గం నాయకురాలికి పదవి ఇవ్వడం ద్వారా తనను కాంగ్రెస్ పార్టీ గౌరవించిందో..అవమానించిందో తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం.