అసలే కంటి చూపు సరిగా లేని మహిళ.. పుట్టెడు కష్టాలతో ఒంటరిగా జీవిస్తోంది.. తన ఇంటి ఎదురుగా నీటి తొట్టె నిర్మాణం వద్దని చెప్పడమే పాపమైపోయింది.. ఆ మాత్రం దానికే ఊగిపోతూ.. కింద పడేసి, చెప్పు కాళ్లతో ఎగిరి తంతుంటే విడిపించడానికి ఎవరూ సాహసించలేదు. జుట్టు పట్టి ఈడుస్తుంటే సినిమా చూస్తున్నట్టు చూశారే తప్పించి వారి గూండాగిరీని
ఎవరూ ఎదిరించలేక పోయారు. ‘కాపాడండయ్యా.. నేనేం తప్పు చేశాను.. ఏమిటీ అన్యాయం’ అని ఆ మహిళ నిస్సహాయంగా విలపించడం అరణ్య రోదనే అయ్యింది.
‘మరో 50 ఏళ్లు ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉండాలి.. ఎప్పుడూ మనమే అధికారంలో ఉంటేనే బావుంటుంది.. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు.. ఈ దిశగా ప్రతి టీడీపీ నేత, కార్యకర్త కృషి చేయాలి.. అధికారులు కూడా మన మాటే వింటారు.. అలా ఎవరైనా వినకపోతే నే చూసుకుంటా’ అని సాక్షాత్తుఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్ది రోజుల క్రితం పదే పదే నొక్కి చెప్పడంతో రాష్ట్రం రావణకాష్టంగా మారుతోంది. ప్రశ్నించిన వారి నోరు నొక్కేస్తూ.. కాదు కూడదన్న వారిపై బహిరంగ దాడులకు తెగిస్తూ తాలిబన్ల పాలనను తలపిస్తున్నారు. ఇసుక మొదలు భూముల వరకు వారి కన్ను పడిందంటే చాలు వశమయ్యేందుకు ఎంతకైనా బరితెగిస్తున్నారు. మొన్న అధికారిణి వనజాక్షిపై దాడి.. నిన్న జీతం
పెంచండన్న అంగన్‌వాడీలపై జులుం.. నేడు ఉరవకొండ నియోజకవర్గంలో అరాచకం..
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజక వర్గం కూడేరు మండలంలో టీడీపీ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వర్గీయులు ఓ మహిళపై దాడి చేసిన తీరు కలకలం రేపింది. ఒంటరి మహిళను నడిరోడ్డుపై చెప్పుకాళ్లతో ఎగిరెగిరి తంతుంటే నిస్సహాయతతో విలవిల్లాడిపోయింది. జాతీయ రహదారి పక్కన, మిట్ట మధ్యాహ్నం.. అందరూ చూస్తుండగానే ‘మేం చెప్పినా
వినవా.. లం.. ముం…’ అంటూ పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషిస్తూ దాడి చేసిన దృశ్యాలు బుధవారం టీవీ చానళ్లలో వీక్షించిన వారు ‘అయ్యో.. ఏమిటీ దారుణం.. ఎంత అధికారంలో ఉంటే మాత్రం మరీ ఇంత బరి తెగింపా.. అడ్డుకునే వారే కరువయ్యారే.. ఈ అరాచకానికి అడ్డుపడేదెప్పుడు’ అంటూ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇంత జరిగితే.. ‘అయ్యా..
న్యాయం చేయండ’ని బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే నిందితులను పిలిపించి బెయిల్ ఇచ్చి పంపించే శారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన సుధమ్మకు కంటి చూపు సరిగా లేదు. నాలుగేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. సంతానం లేదు. తల్లి ద్రాక్షాయణమ్మ నాలుగు నెలల క్రితం మృతి చెందింది. సోదరుడు రాంభూపాల్‌రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం అనంతపురం–బళ్లారి ప్రధాన
రహదారి పక్కన పంచాయతీ తరఫున పశువులకు తాగునీటి తొట్టె నిర్మించేందుకు తెలుగుదేశం పార్టీ నేత, సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర సిద్ధమయ్యారు. తన ఇంటి ముందు కాకుండా కొంచెం పక్కన తొట్టె నిర్మించుకోవాలని సుధమ్మ కోరింది. అంతే.. మాకే అడ్డు చెబుతావా.. అంటూ ఆగ్రహించిన వారిద్దరూ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు.
మహిళ అని కూడా చూడకుండా అందరి ముందు దుర్భాషలాడారు. తలోచేయి పట్టుకుని కింద పడేశారు. అంతటితో ఆగకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సర్పంచ్ నాగరాజు చెప్పుకాళ్లతో ఎగిరి తన్నగా.. చంద్ర చేతితో కొట్టాడు.‘ఏ నిమిషంలో ఏం జరుగుతుందో భయంగా ఉంది. వారిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఉన్నతాధికారులు నాకు రక్షణ కల్పించాలి. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేద’ని బాధితురాలు సుధమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Copy From Sakshi
Posted by Sarat Kumar Dasari on Friday, 4 May 2018