బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి తానే కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకొనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన మాటల్లో ఎంత చిత్తశుద్ధితో ఉంటారో తెలియజెప్పేందుకు మరో ఉదాహరణ ఇది. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, దళిత నేతను ఆయన మళ్లీ అవమానించారు. చంద్రబాబు తీరుపై విమర్శలు చేయడంతో పాటు టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసిన పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు రాష్ట్ర నాయకత్వం సమావేశానికి రావాలని ఆహ్వానం పంపలేదు.
శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో నిర్వహించిన తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశంలో నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. అయితే ఈ సమావేశానికి ఆయనకు ఆహ్వానం అందలేదు. గత జనవరి నెల నుంచి పార్టీ కార్యక్రమాలకు మోత్కుపల్లిని రాష్ట్రపార్టీ నేతలు ఆహ్వానించడం లేదు. గతంలో టీటీడీపీ నేతలు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించినప్పుడు కూడా ఆహ్వనం అందకపోవడంతో మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. తాజాగా శుక్రవారం నిర్వహించిన సమావేశానికి కూడా ఆహ్వానం అందకపోవడంతో ఇక టీడీపీలో మోత్కుపల్లి శకం ముగిసినట్లేనని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.