ఈ నెల 12 న జరగనున్న కర్నాటక శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది . ఈ మేనిఫెస్టో ముఖ్యంగా మహిళల దృష్టిని ఆకర్షించే విధంగా, రైతులకు హామీ కల్పించే విధంగా రూపొందించింది. కర్నాటకలో బీజేపీ అధికారంలోని వస్తే ముఖ్యమంత్రి స్మార్ ఫోన్ యోజన అనే ఒక కొత్త పథకంను అమలు చేస్తామని తెలిపింది . అంతే కాకుండా గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తామని వెల్లడించింది .
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం రూ. 1,50,000 కోట్లు కేటాయిస్తాం.
ప్రతీ ఎకరాకు సాగునీరివ్వడమే లక్ష్యం.
రైతు రుణాలను రూ. 1 లక్ష వరకు మాఫీ, ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తాం.
మహిళల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. వారి రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం.
మహిళలపై ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక విచారణ అధికారిని నియమిస్తాం.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలందరికీ ఫ్రీగా స్మార్ట్ఫోన్లు ఇస్తాం.
స్త్రీ సువిధ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలు, అమ్మాయిలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ ఇస్తాం. మిగతా వారికి ఒక్క రూపాయికి ఇస్తాం.
మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు.
కర్నాటక వ్యాప్తంగా అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం.
హైదరాబాద్- కర్నాటక ఇండస్ట్రీయల్ మెగా కారిడార్‌ను హోస్పేట నుంచి హైదరాబాద్ వరకు నిర్మిస్తామని బిజెపి తన మేనిఫెస్టోలో వెల్లడించింది.