టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో స్థాపించిన కొత్త పొలిటికల్ పార్టీ “జనసేన”.అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతోనే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఇటు తెలుగు తమ్ముళ్ళు అటు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటారు .అయితే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మూత పడుతుందా అనే అంశం గురించి అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో మోస్ట్ సీనియర్ జర్నలిస్టు అయిన “ఇలపావులూరి మురళీ మోహన రావు “గారి మాటల్లో చూద్దామా ..!
ఏప్రిల్ లో నిరాహారదీక్ష, ఉద్యమం అన్నారు. అదేమైందో తెలియదు. ఆ తరువాత మే ఒకటో తారీకు పవన్ నిరాహాహారదీక్ష చేస్తారు అని పత్రికల్లో వార్తలు వచ్చాయి. నాకు తెలిసినంతవరకూ మే ఒకటోతారీకు వెళ్ళిపోయింది. పవన్ నిరాహార దీక్ష చేసినట్లు నాకు వార్తలు కనిపించలేదు. బహుశా అది 2019 మే నెల ఏమో తెలియదు.మంగళగిరిలో ఆర్భాటంగా ప్లీనరీని నిర్వహించారు. సాధారణంగా ప్లీనరీ సమావేశం జరిగినపుడు ఇతరపార్టీలనుంచి కొందరు ప్రముఖ నాయకులు సదరు పార్టీలో చేరుతుంటారు. కానీ, జనసేనలో ఒక్కరు కూడా చేరిన దృష్టాంతం లేదు. నాలుగేళ్ల నుంచి ఆ పార్టీలో పవన్ తప్ప మరోనాయకుడు చెప్పుకోవడానికి లేడు.
ప్లీనరీ తరువాత పాదయాత్రలు, జనంలోకి వెళ్లడం గట్రా లాంటి ప్రోగ్రాములు ఉంటాయని చెప్పారు. పాదయాత్ర మూడున్నర కిలోమీటర్లతో ముగిసింది. జనంలోకి వెళ్లడం మాత్రం జరగలేదు, సరికదా, ఆ తరువాత అసలు జనసేన కార్యకలాపాలు లేవు. కేంద్రం ఏమిచ్చిందో లెక్కలు తీస్తా అని ఒక కమిటీని వేశారు. పవన్ గాలిమాటలు నమ్మి జయప్రకాశ్, ఉండవల్లి, కృష్ణారావు, పద్మనాభయ్య లాంటి మేధావులు పరువు పోగొట్టుకున్నారు. ఆ కమిటీ తదుపరి చర్యలు ఏమిటో అంతుబట్టడం లేదు. బహుశా ఆ సన్నివేశానికి శుభం పలికి ఉంటారు.పార్టీని మొదలుబెట్టి నాలుగేళ్లు దాటినా, ఇంతవరకు ఆ పార్టీకి నాయకులు, కార్యకర్తలు లేరు. కాపులు నమ్మడం లేదు. కమ్మలు అసలు నమ్మరు.
రెడ్లు అసహ్యించుకుంటారు. బీసీలు పవన్ ముఖం కూడా చూడరు. ఇది మాకు నమ్మకమైన ఓటు బ్యాంకు అని చెప్పుకోవడానికి ఇంతవరకు పవన్ కు ఒక వర్గం అంటూ లేదు. ఒకప్పుడు పవన్ ఇంటి గుమ్మం ముందు నుంచి పోర్టికోలో కారులో అడుగుపెట్టేవరకూ మీడియా కవరేజ్ ఉండేది. పవన్ కారు రోడ్లమీద ప్రయాణిస్తుంటే కూడా కవరేజ్ ఉండేది. గత నెలరోజులుగా పవన్ ను టీవీల్లో చూపించడమే మానేసింది మీడియా. చంద్రబాబు పాదాలు పట్టుకుని శరణు కోరేంతవరకు పవన్ పరిస్థితి ఇలాగే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అధవా ఏమైనా చూపించినా, అది పవన్ ను విమర్శించడానికే తప్ప స్తుతించడానికి కాదు. కొద్దీ కాలం క్రితం “కరుసైపోయిన కోటేశ్వరావు” అనే శీర్షికన ఒక వ్యాసం రాసాను. ఆ ఖర్చు కావడం ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదు.చిరంజీవి కనీసం రెండేళ్లు పార్టీని నడిపాడు. ఆయనకు పద్దెనిమిది సీట్లు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ కొనుగోలు చేసింది. రేపు జనసేనకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశమే లేదు. కాబట్టి పవన్ అమ్ముడుబోవడం కూడా కష్టమే. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం జనసేనకు రెండు లేదా మూడు సీట్లు వస్తాయి. అది కూడా గట్టిగా చెప్పలేము.
మాటకి నిలకడ లేదు
మనిషికి నిలకడ లేదు
చెప్పేది ఒకటి
చేసేది ఒకటి
అనే ముప్ఫయి ఏళ్ళక్రితం విడుదల అయిన హీరో కృష్ణ సినిమా పాట గుర్తొస్తుంది అని సోషల్ మీడియాలో ఇలపావులూరి మురళీ మోహన రావు గారు పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది ..