రైతుకు సేవ చేయడమంటే.. మనం ఎంతో అదృష్టం చేసుకున్న వారమని వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులను ఉద్దేశించి రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలో నూతనంగా ఉద్యోగంలో ఎంపికైన 45 మంది వ్యవసాయ శాఖ విస్తరణ-ఏఈఓలకు అపాయింట్ మెంట్ ఆర్డర్ల ప్రోసిడింగ్స్ కాపీలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ” తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక, వ్యవసాయ శాఖ చాలా ముఖ్యమైన శాఖగా మారిందని, గత ప్రభుత్వాలు రైతుకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక రైతుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వం వచ్చాక, చెరువుల పునరుద్ధరణ, పంటలు కొనుగోలు, గోదాములు, విద్యుత్, ప్రాజెక్టులు ఇలా ఈ రంగాలన్నీ రైతు శ్రేయస్సుకై పాటుపడుతాయని, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.8వేల పెట్టుబడి సాయం చేస్తూ.. రైతులకు అందజేస్తున్నదని, ఇందుకు సంబంధించిన చెక్కులు అందించే సమయానికి మీకు ఉద్యోగాలు రావడం పట్ల ప్రతి ఏఈఓకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ ఉన్న ఏఈఓలలో ఎక్కువగా మహిళలు ఉన్నారని., కాబట్టి మహిళా రైతులకు సేవ చేయాలని సూచించారు. జిల్లాలో ముందుగా 16 మంది ఏఈఓలు ఉంటే., ఇవాళ 106 మంది వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులుగా ఉన్నారని పేర్కొన్నారు. మీరంతా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పై ఆరా తీసి మీరంతా గట్టి పట్టుదలతో కసిగా పని చేయాలని మీ వద్ద ప్రతి రైతు వివరాలు ఉండాలని, రైతులతో మమేకమై వారితో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని కోరారు.
నీటి వనరులను ఆదా చేస్తూ.. వ్యవసాయం రంగంలో వాటిలోని పలు మెళుకువలు చెబుతూ.. ఎన్నో మార్పులు తేవాలని దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం గొప్ప అడుగు వేసిందని., ఈ సమయంలోనే మీరు ఏఈఓలుగా చేరడం మీ అదృష్టమంటూ.. ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యం చాలా అవసరం అన్నారు. మీరంతా యంగ్ స్టార్స్ వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పులు పై అవగాహన కలిగి ఉంటూ.., రైతుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించి సేంద్రీయ వ్యవసాయం పై ప్రజలలో చైతన్యం తేవాలని సూచించారు. మీ సెల్ ఫోన్, ట్యాబ్ లలో ప్రతీ రైతు వివరాలు ఉండాలని, వ్యవసాయ పరమైన సమస్యల విషయ వేదికలో మీ పాత్ర చాలా గొప్పదని ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని కోరారు. వ్యవసాయ శాఖ అంటే.. గ్రామం, రైతు అనే ఆలోచనతో పని చేయాలని, మేము చేస్తున్న పని ఎక్కడ అనేది కాదు, కేవలం వ్యవసాయ శాఖలో పని చేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలని కోరారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా మనస్సు నిబ్బరం చేసుకుని పని చేసి రైతుల మనస్సును గెలిచేలా తమ సేవలు ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామని., కాదు ప్రజా సేవకులుగా ఉద్యోగం చేస్తున్నామని రైతు మనస్సును గెలువాలని ” ఏఈఓలకు మంత్రి హరీశ్ రావు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి ఛీఫ్ విప్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, జిల్లా వ్యవసాయ శాఖ శ్రవణ్, ఇతర అధికారులు అనిల్, ఏఈఓలు గార్లు ఉన్నారు.