ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. తిరుమల వచ్చిన ఆయన… ఏపీలోని తాజా రాజకీయాలపై స్పందించారు. ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయి… వైసీపీ గ్రాఫ్ పెరిగిందన్నారు విష్ణు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే… వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని… 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమన్నారు. ఏపీలో చంద్రబాబు చేస్తున్నది అధర్మ పోరాటమన్న ఆయన… కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అయినా బాబు చెబితే జనాలు ఓట్లు వేసే పరిస్థితి లేదని… అక్కడ బీజేపీ విజయం ఖాయమన్నారు.పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు విష్ణుకుమార్ రాజు. 15 రోజుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై… సీబీఐ విచారణ కోరతామని… పట్టిసీమలో అవినీతికి పాల్పడిన వారికి శిక్ష తప్పదన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పటి నుంచి బీజేపీ టార్గెట్ చేస్తోంది. మరి విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో.
