తన సొంత ఇలాకా అయిన చిత్తూరులో దీక్షకు సిద్ధమవడం ద్వారా ఓ రేంజ్‌లో మైలేజ్ కొట్టేద్దామని ప్రయత్నించి ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం ఇది. ఇంకా చెప్పాలంటే…ఆయన కలలో కూడా ఊహించని షాక్ అనుకోవచ్చు. `తన అవసరం కోసం కరివేపాకు లాగా ఎవరినైనా వాడుకోవడమనేది సిద్ధాంతానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు` అని ఆయన విమర్శకులు చేసే మాటలకు అచ్చుగుద్దిన ఉదాహరణ. ఇలాంటి చర్చ మళ్లీ తెరమీదకు తెచ్చింది ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఎన్‌టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరును వైఎస్ జగన్ సందర్శించడం…ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ…వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు పెడతామని హామీ ఇవ్వడం తెలిసిన సంగతే. దీంతోపాటుగా నిమ్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒక్క నిర్ణయంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇది బాబు వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టే నిర్ణయమే కాకుండా ఓట్ల కోణంలోనూ జగన్ అనూహ్యమైన ఎత్తుకు ఎదిగారని అంటున్నారు. కీలకమైన రాజకీయ సమీకరణాల ప్రకారం చూస్తే… జగన్ నిర్ణయం పెద్ద ఎత్తున ప్రభావం చూపేదనే విషయంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. ఏపీ రాజకీయాలను గమనించిన వారి ప్రకారం గుంటూరు, కృష్ణా జిల్లాలే గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయి. దాని తర్వాత తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా. జగన్ తాజా నిర్ణయంతో ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీకి ఓఉట బ్యాంకుగా ఉన్న కమ్మ సామాజికవర్గం ఆలోచనలో మార్పు రావచ్చునని అంటున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ, బీసీ ఓట్లపై ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు. పార్టీలో చేరిన నేతలకు బలం చేకూర్చేలా ఉంటుందని వివరిస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో పోయిన ఎన్నికల్లో వైసీపీ 5 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. ఈ దఫా ఇప్పటికే ఉన్న ట్రెండ్‌కు తాజా నిర్ణయం తోడయి 20 సీట్ల వరకు వచ్చే చాన్సుందని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు. ఇక గుంటూరు, కృష్ణాలో గతం కంటే అధిక సంఖ్యలో ఓట్లు సంపాదించడం సులువు అవుతుందని అంటున్నారు.