రాష్ట్ర ఐటీ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఓ యువకుడు చేసిన ట్వీట్ వైరల్ అయింది. తన గల్ఫ్ కష్టాలకు పరిష్కారం చూపించి సొంత ఊరికి వచ్చేందుకు సహాయం చేసిన యువకుడు కృతజ్ఞతలు తెలిపారు. తన కష్టాలకు మంత్రి కేటీఆర్, అమెరికాలోని భారత రాయభార కార్యాలయం వల్ల పరిష్కారం దొరికిందని హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే…జగిత్యాల జిల్లాకు చెందిన రవిపటేల్ అను యువకుడు ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అయితే ఆయనకు కంపెనీ ద్వారా పలు సమస్యలు ఎదురవడంతో మంత్రి కేటీఆర్, ఎంపీ కవితకు ఆవేదనను వెల్లడిస్తూ ఆదుకోవాలని కోరాడు. ‘నాలుగు నెలలుగా కంపెనీ జీతాలు ఇవ్వడం లేదు. ఇంటికి వెళ్లిపోతానంటే అనుమతి ఇవ్వడం లేదు. నాకు చనిపోవాలని ఉంది. నన్ను ఆదుకునేందుకు సహకరించగలరు’ అంటూ కోరారు.
దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ నిరాశ చెందవద్దని ధైర్యం చెప్పారు. రవిని భారతదేశానికి తీసుకువచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని తన కార్యాలయానికి మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతో మంత్రి కేటీఆర్ కార్యాలయానికి చెందిన బృందం రియాద్‌లోని భారత రాయభార కార్యాలయంతో సమన్వయం చేసుకొని ఆ సంస్థతో చర్చలు జరిపింది. ఆయన్ను స్వదేశానికి వచ్చేందుకు అనుమతి ఇప్పించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరిగి వచ్చేందుకు ఉచిత విమాన టికెట్ అందించారు. మంగళవారం ఉదయం ఆయన రియాద్ నుంచి హైదరాబాద్‌కు విచ్చేశారు. తనను స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేసిన మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా రవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.