స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రానికి చేసిన సేవలను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన పుట్టిన గడ్డ నిమ్మకూరుకు నా పాదయాత్ర చేరిన సందర్భంగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తూ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని, ఆయన్ను వెన్నుపోటు పొడిచి టిడిపిని హస్తగతం చేసుకున్న చంద్రబాబు కుట్ర గురించి అందరికీ తెలుసన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ స్మారకార్థం కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) జిల్లాగా మార్చుతామని ప్రకటించారు.దీంతో సొంత కుమారులు, అల్లుడు చేయలేని పని వైఎస్ జగన్ చేస్తానని ప్రకటించారని, కృష్ణా జిల్లాకు ఎన్.టి.ఆర్. పేరు పెడతామని ప్రకటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఎన్ టి.ఆర్ బార్య లక్ష్మీపార్వతి అన్నారు. తన గుండె ఆనందంతో ఉప్పొంగుతోందని ఆమె అన్నారు. ఈ పాటి ఆలోచన చంద్రబాబుకు కాని, కొడుకులు,కూతుళ్లకు రాకపోవడం సిగ్గుచేటని ఆమె అన్నారు. జగన్ పెద్దల పట్ల ఎంతో భక్తిని చూపారని, ఆయనను చూసి వీళ్లంతా బుద్ది తెచ్చుకోవాలని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు అన్ని పదకాలకు తన పేర్లు పెట్టుకుంటున్నారని,ఎన్.టి.ఆర్.కు మాత్రం కేవలం దండవేసి సరిపెడుతున్నారని ఆమె ద్వజమెత్తారు.