తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి రెడ్డిసంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన రైతుబంధు, పాస్ బుక్కుల పంపిణీ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.ఈనెల 10 నుంచి 17 వరకు రైతు బంధు పథకం అమలు జరుగనున్నట్లు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుకు పెట్టుబడి పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోందన్నారు. ప్రస్తుతం యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు రైతుబందు పథకం ద్వారా చెక్కులు ఇవ్వబోతున్నామని చెప్పారు.రైతుబంధు పథకం చెక్కుల పంపిణీని పండగలా నిర్వహిస్తామన్నారు. బ్యాంకర్లు పాత బకాయిలు పెట్టుకోకుండా చెక్కు ఇవ్వగానే డబ్బులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.