ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు బుక్ అయిపోయారు. ఈ దఫా పార్టీ నేతల దృష్టిలోనే ఆయన చులకన అయిపోయారని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి అట్టహాసంగా సభ పెట్టుకుంటే.,.అది కాస్త తనకే కౌంటర్ అయిందని మథనపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభ గురించే ఈ చర్చ అంతా. అందులోనూ బాబు దాచిపెట్టిన వీడియోల గురించే ఈ కామెంట్లన్నీ.
ధర్మపోరాట దీక్ష పేరుతో ఏర్పాటు చేసిన సభలో బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో తిరుపతి వచ్చిన నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ప్రత్యేక హోదా హామీ ఇవ్వడం, ఏపీ విభజనకు సంబంధించిన హామీలను నెరవేరుస్తానంటూ ఇచ్చిన హామీల సీడిని బాబు ప్రదర్శించారు. నాలుగేళ్ల కంటే ముందు ఇదే రోజు, ఇదే సమయంలో వెంకన్న సాక్షిగా హామీలు ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేకహోదా ఇస్తామని కేంద్రం మాయమాటలు చెప్పిందన్నారు. పది రాష్ట్రాలకు 90:10 చొప్పున స్పెషల్ స్టేటస్ ఇచ్చి… ఏపీకి మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమనడం అన్యాయం అన్నారు. ఏపీకి కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదని నిలదీశారు.
అయితే, బాబుకు ఈ సందర్భంగానే పలువురు ఏపీ వాసులు సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. నీతి అయోగ్ హోదా ఇవ్వబోమని చెప్పినపుడు, ప్రత్యేక హోదాకు చాన్సే లేదు..ప్యాకేజీతో సరిపుచ్చుకోమన్నపుడు చంద్రబాబు స్పందించ లేదని గుర్తు చేస్తూ..నాలుగేళ్ల తర్వాతే ప్రత్యేక హోదా వీడియో గుర్తుకు వచ్చిందా బాబు అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఏపీ యువతను, వామపక్షాల నేతలను హోదా కోసం మొదటి నుంచి గళం విప్పుతుంటే వారిపై కేసులు పెట్టించిన తీరుకు సంబంధించిన వీడియోలు దొరకలేదా అంటూ బాబు తీరును ఎద్దేవా చేస్తున్నారు. మోడీ వీడియోల సంగతి సరేనని పేర్కొంటూ…వీటి సంగతి ఏంటి బాబు అంటూ నిలదీస్తున్నారు. తన అవసరం కోసం ప్రత్యేక హోదా ప్రస్తావన తెస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మబోరని మొదటి నుంచి హోదా విషయంలో పోరాటం చేస్తున్న పార్టీలనే ఈ విషయంలో ప్రజలు గౌరవిస్తారని స్పష్టం చేస్తున్నారు.