నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రజల సంక్షేమమే పరమావధిగా.. పదునైన మాటలతో అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించే మాటలతో రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ చంద్రబాబు సర్కార్‌పై విరుచుకుపడ్డారు. కాగా, ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంచన వ్యతిరేక దీక్షలో పాల్గొన్న అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు ఒక్క వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. ఈ రోజు ప్రతీ ఒక్కరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారంటే.. అందుకు కారణం ఒక్క జగన్ అని అన్నారు.
ఎప్పుడైతే వెఎస్ జగన్ ప్రజా సమస్యల పరిష్కార అధ్యయనం కోసం ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారో.. అప్పట్నుంచే సీఎం చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా, ఎండవేడిమి 50 డిగ్రీలు దాటినా, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజా సంకల్ప యాత్రతో ఎక్కడ డిపాజిట్లు కోల్పోతామా అన్న డైలమాలో చంద్రబాబు ఉన్నారని, జగన్ మోహన్‌రెడ్డిని చూసి ప్రత్యేక హోదా అంటూ చంద్రబాబు మళ్లీ డ్రామాలు ఆడటం మొదలు పెట్టారని ఎద్దేవ చేశారు అనీల్ కుమార్ యాదవ్. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే కోట్లాది మంది ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.
వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన రోజే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి మనం ఇచ్చిన సరైన నివాళి అని, ఆ రోజు కోసం ప్రతీ ఒక్క వైసీపీ కార్యకర్త, నాయకులు పని చేయాలని పిలుపునిచ్చారు. 2019 వరకు వైఎస్ జగన్‌ను మీ భుజ స్కందాలపై మోయండి.. 2019 తరువాత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి స్థాయిలో మిమ్మల్ని తన భుజ స్కందాలపై మోస్తాడని మీకందరికీ తెలియజేస్తున్నానంటూ ఎమ్మెల్యే అనీల్ కుమార్ తన ప్రసంగాన్ని ముగించారు.