దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే కీలక సమావేశాలు నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం..,తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే.
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తోడుగా రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్ రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నానికి తోడుగా తాను సైతం కీలక నేతతో చర్చలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదిపార్టీ నేత అఖిలేశ్‌యాదవ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. గత బుధవారం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ లక్నో వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్‌పై ఇరువురు చర్చించుకున్నట్టు సమాచారం. దానికి కొనసాగింపుగా అఖిలేశ్ హైదరాబాద్ వచ్చి, సీఎం కేసీఆర్‌తో సమావేశమవనున్నారు.
మే 2వ తేదీన హైదరాబాద్ రానున్న అఖిలేష్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో సమావేశమై, ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించనున్నారు. అఖిలేశ్‌యాదవ్‌తో భేటీ తదుపరి భువనేశ్వర్‌కు వెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.