ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ప్రభుత్వం ఆదుకుని సహాయం అందిస్తుందని, దీని కోసం రూ.50 కోట్ల నిధితో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఐఎఎస్ అధికారి నేతృత్వంలో పనిచేసే ఈ సెల్ కు అనుబంధంగా వివిధ దేశాల ప్రతినిధులతో తెలంగాణ ఎన్ఆర్ఐ కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. ఎన్ఆర్ఐ సెల్, కమిటీ ఏర్పాటు, అవి పనిచేసే విధానంపై కార్యాచరణ రూపొందించాల్సిందిగా మంత్రి కెటి రామారావు, ఎంపి కవితలను సీఎం ఆదేశించారు. తెలంగాణ ఎన్ఆర్ఐల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం ఈ సెల్, కమిటీ పనిచేయాలని సిఎం కోరారు. ఎన్.ఆర్.ఐ.ల సంక్షేమం కోసం బడ్జెట్లో వంద కోట్ల కేటాయించామని, అందులోంచి 50 కోట్ల రూపాయలను సెల్ కు బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైన పక్షంలో మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. భారతదేశ ప్రజల ఎజెండా రూపొందించడంలో తెలంగాణ నాయకత్వం చేస్తున్న కృషిని వివరించాలని చెప్పారు. తెలంగాణ బిడ్డలుగా నాడు ఉద్యమ సందర్భంలో ఎలాంటి సహకారం అందించారో, నేడు భారతదేశ బిడ్డలుగా దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వివిధ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో శనివారం మద్యాహ్న భోజనం చేశారు. అనంతరం వారితో తెలంగాణ అభివృద్ధి – జాతీయ రాజకీయాలు – ఎన్ఆర్ఐల సంక్షేమం తదితర అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటి రామారావు, నాయిని నర్సింహరెడ్డి, ఎంపి కె.కవిత, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, గణేష్ గుప్తా, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఎండిసి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ఎన్.ఆర్.ఐ.ల సమన్వయ కర్త మహేష్ బిగాల తదితరులు పాల్గొన్నారు.
‘‘అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాం. ఇవాళ అనేక అంశాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. అద్భుతమైన పద్ధతిలో ముందుకుపోతున్నాం. రాజకీయ స్థిరత్వం సాధించాం. భవిష్యత్ చాలా ఆశాజనకంగా ఉంది. ప్రగతిపథంలో మనం ముందుకుపోతున్నాం’’ అని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని వివరించారు.‘‘దేశంలోని ఒక రాష్ట్రంగా ఆలోచించినప్పుడు సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం బాగున్నామనిపిస్తుంది. కానీ మొత్తం దేశం పరిస్థితి బాగా లేదు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం. 70 వేల టిఎంసిల నీరు అందుబాటులో ఉంది. కానీ సాగునీరు, తాగునీటికి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. 40 టిఎంసిలు వాడుకుంటే దేశం మొత్తం మీద ఉన్న 40 వేల కోట్ల ఎకరాలకు సాగునీరు అందించుకోవచ్చు. ఈ మాత్రం పని మన పాలకులు చేయలేదు. సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది పడే దుస్థితి ఉంది. కేంద్ర బడ్జెట్ 24.47 లక్షల కోట్లు. అందులో 8.70 లక్షల కోట్లు అప్పుల కిస్తీలకు పోతుంది. 10 లక్షల కోట్ల జీతభత్యాలు, పెన్షన్ల లాంటి నిర్వహణ ఖర్చుకు పోతుంది. ఐదారు లక్షల కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాలు (సిఎస్ఎస్)కు పోతుంది. ఇక మిగిలేది రెండు మూడు లక్షల కోట్లు మాత్రమే. కేవలం ఈ రెండు మూడు లక్షల కోట్లతో ఇంత పెద్ద జనాభా ఉన్న విశాల దేశంలో అభివృద్ధి పనులు ఎలా సాగుతాయి? ఇట్ల చేసుకుంటూ పోతే దేశం ఎట్ల బాగుపడాలి. ఎన్నడు బాగుపడాలి? ఏడు దశాబ్దాలు గడిచినా దేశంలో ఎక్కడ చూసినా అశాంతి, అసంతృప్తి, ఆందోళన. కులం పేరిట, మతం పేరిట ఘర్షణలు. వీటికి పరిష్కారం లేదా? ఈ విషయాలను ఎన్.ఆర్.ఐ.లు ఆలోచించాలి. మన పక్కనే ఉన్న చైనా ఇప్పుడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా మారింది. మనమెందుకు మారడం లేదో ఆలోచించాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.
‘‘చాలా అంశాల్లో మన దేశం ఇతర దేశాలతో పోలిస్తే ఎంతో వెనుకబడింది. ఈ పరిస్థితి రావడానికి ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బిజెపిలే కారణం. ఇప్పుడు కూడా నరేంద్రమోడీపై వ్యతిరేకత వస్తే, రాహుల్ గాంధి ప్రధాని అవుతారు. అయితే ఏలాభం? దేశానికి ఏం మేలు జరుగుతుంది? ఏం మార్పు సాధ్యమవుతుంది? ఒకరి మీద కోపంతో మరొకరిని గెలిపిస్తాం. ఎవరు గెలిచినా పరిస్థితిలో మార్పు మాత్రం రాదు. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. ప్రజల ఎజెండా తయారు కావాలి. నిజంగా ఈ దేశానికి ఏం కావాలి? ఈ దేశం ఎటు పోవాలి? అనే మార్గదర్శకం అవసరం. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నారు. దేశ ప్రజలకు కావాల్సిన ఎజెండా రూపొందిస్తున్నాను. ఈ ఎజెండాను యావత్ దేశం అంగీకరిస్తుంది. దాని ప్రకారం వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు రూపొందించుకుంటే తప్పక మార్పు సాధ్యమవుతుంది. నేను పదవుల కోసమో, ఇంకా దేనికోసమే జాతీయ రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఈ దేశ పౌరుడిగా, దేశంలో మార్పు తేవడానికి నా వంతు ప్రయత్నం ఏదైనా చేయగలనా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని, పని మొదలుపెట్టాను. మనకెందుకులే అనుకుంటే తెలంగాణ వచ్చేదా? మనకెందుకులే అని అందరూ అనుకుంటే దేశంలో మార్పు సాధ్యమవుతుందా? ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి. అది మనమే చేశాం. మనం ప్రయత్నిస్తే తప్పక మార్పు సాధ్యమవుతుంది. ఎన్.ఆర్.ఐ.లు ఈ విషయాలను ప్రపంచ వ్యాప్తంగా చర్చించాలి. ఉద్యమ సమయంలో మనమెందుకు పోరాడుతున్నామో అందరికీ చెప్పారు. మీరు చేసిన సహాయం, సహకారం ఉద్యమానికి ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం మనం చేస్తున్న ప్రయత్నాలపై కూడా విస్తృత చర్చ పెట్టాలి’’ అని సిఎం పిలుపునిచ్చారు.