ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1950, డిసెంబర్ 25న ఆనం వివేకా జన్మించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయనాయకుడిగా ఆనం వివేకా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆనం వివేకా అతి చిన్న వయసులోను రాజకీయాల్లోకి ప్రవేశించారు. సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన ఆనం వివేకా అంచెలంచెలుగా ఎదుగుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఆనం ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డి పాటు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు. ఇటీవల అనారోగ్యంతో ఆనం వివేకా హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆనం ఇక లేరనే విషయాన్ని నెల్లూరు జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.
