తెలుగు రాష్ర్టాల్లో బలపడాలని…అధికార పక్షాన్ని గద్దెదించాలని…ఇప్పటికే ఉన్న ప్రతిపక్షాల కంటే తామే బలోపేతం అయిపోయి సత్తా చాటుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోణంలో అవకాశం దొరికినప్పుడల్లా ఆ పార్టీ నేతలు భారీ ప్రకటనలు ఇచ్చేస్తుంటారు. తాము బలపడిపోతున్నామని…ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అటు తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని జోస్యం చెప్తుంటారు. తమ పార్టీలోకి ముఖ్య నేతలు చేరబోతున్నారని కూడా ప్రకటిస్తుంటారు. అయితే అంత సీన్ లేదని పైగా ఉన్న నేతలే పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇంకో పార్టీలో చేరిపోతున్నారని తాజా పరిణామాలతో స్పష్టం అవుతోంది.
వివరాల్లోకి వెళితే…బీజేపీకి రెండు రాష్ర్టాల్లోనూ ఒకట్రెండు రోజుల తేడాతో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక మంది పోటీ పడ్డారు. పార్టీ అధ్యక్ష రేసులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్లు చివరి వరకూ పరిశీలనలో ఉన్నాయి. అధిష్టానం మాత్రం సోము వీర్రాజు వైపు మొగ్గు చూపింది. తనకే అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించిన కన్నా లక్ష్మీనారాయణ పదవి రాకపోవడంతో భంగ పడ్డారు. తాజాగా వైసీపీలోకి మారాలనే ఆలోచనతో శనివారం గుంటూరులో తన అనుచరులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ గుడ్ బై చెప్పి వైసీపీలో ఈనెల 25న చేరను న్నట్లు సమాచారం. కాపు నేతల్లో కన్నాకు మంచి పట్టుఉంది. రాజకీయాల్లో సీనియర్ నేత కావడం, కాంగ్రెస్‌లో మంత్రి పదవి చేసిన అనుభవంతో ఆయనకు అన్ని వర్గాలతోనూ సత్సంబంధాలున్నాయి. ఇది వైసీపీకి కలిసివచ్చే అవకాశం అని అంటున్నారు.
రాయలసీమలో పాణ్యం ప్రాంతంలో మంచి పట్టు ఉండే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈనెల 28న బీజేపీని వదిలి వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాటసాని పార్టీని వదలడం దాదాపుగా నిర్ధా రణ కావడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా పలువురు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ నుంచి సీనియర్ నేత కన్నా పార్టీ మారేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కమలం పార్టీకి కోలుకోలేని దెబ్బగా పలువురు రాజ కీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. అదే సమయంలో వైసీపీకి ఖచ్చితంగా కీలక నిర్ణయంగా వివరిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ విషయానికొస్తే మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ నియోకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ఈనెల 25న బిజెపిని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం ఖరారు అయింది. ఈ నేపథ్యంలో ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా…ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రం అన్నట్లుగా పార్టీకి ముఖ్య నేతలు గుడ్‌బై చెప్తున్న సమయంలో…ఇక బీజేపీ బలపడే అవకాశం ఎక్కడ అని ఆ పార్టీ నేతలే నిర్వేదానికి గురవుతున్నారు.