ఏపీలో దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. చిన్న.పెద్ద ,ముసలి..అంగవైకల్యం అనే తేడా లేకుండ వావి వరసలు మరచి కామంంతో కళ్లు ముసుకుపోయి ఆడవారిపై అత్యచారాలు చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ విధివంచిత.. పుట్టుకతో మూగ.. పైగా మానసిక వైకల్యంతో బాధపడుతోంది. అలాంటి మహిళపై సాధారణంగా ఎవరైనా సానుభూతి చూపుతారు. కానీ ఓ టీడీపీ నాయకుడు మాత్రం ఆమెపై కన్నేశాడు. తన కామ వాంఛ తీర్చుకునేందుకు అవకాశం కోసం కాసుకూర్చున్నాడు. ఆదివారం అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడులో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన 30 ఏళ్ల మూగ యువతి మానసిక వైకల్యంతో బాధపడుతోంది. తల్లి చనిపోగా ఆమె తండ్రి వేరే వివాహం చేసుకుని చిలకలూరిపేటలో నివసిస్తున్నాడు. దీంతో వృద్ధురాలైన నాయనమ్మ, అన్న, వదినలతో కలసి గ్రామంలోనే ఉంటోంది.
నాలుగు రోజుల కిందట బాధితురాలి అన్న, వదిన కూలి పనుల నిమిత్తం వేరే ఊరు వెళ్లారు. ఈ నేపథ్యంలో కేన్సర్‌తో బాధపడుతున్న నాయనమ్మతో కలసి ఆదివారం రాత్రి ఆ యువతి ఆరుబయట మంచంపై నిద్రించింది. అర్థరాత్రి 12 గంటల సమయంలో టీడీపీ నాయకుడు గోళ్లమూడి లక్ష్మయ్య ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని కేకలు వేసి చెప్పలేని ఆ యువతి.. తన శక్తి మేర ప్రతిఘటించసాగింది. అదే సమయంలో నిద్రలేచి బయటకు వచ్చిన ఎదురింటి మహిళ ఇది గమనించి.. పెద్దగా కేకలు వేస్తూ అందర్నీ నిద్రలేపింది. దీంతో లక్ష్మయ్య అక్కడ్నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై బాధితురాలి బంధువులు సోమవారం నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, ఎస్‌ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మూగ, మానసిక వ్యాధుల వైద్య సిబ్బంది సాయంతో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకొని.. ఆ తర్వాతే వైద్య పరీక్షలకు పంపిస్తామని చెప్పారు. నిందితుడు అధికార పార్టీ నాయకుడు కావడంతో బాధితురాలికి న్యాయం చేస్తారో.. లేదోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.