తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంగాధర మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసి సభలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.చెరువులు నిండితే నే పంటలు సంవృద్దిగా పండుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి దాని ద్వారా చెరువులను పునరుద్ధరిస్తుందని తెలిపారు.
గతంలో వెయ్యి ఫీట్ల బోరు వేసినా చుక్కా నీరురాని గంగాధర మండలంలో ఇప్పుడు మండు వేసవిలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయని చెప్పారు.రాష్ట్రంలో నీటి సమస్యలు తీరుతాయన టానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు అని అన్నారు.కాంగ్రెస్ హయాంలో 500 కోట్లు పెన్షన్ కోసం ఖర్చు చేస్తే.. తెలంగాణ పెన్షన్ కోసం 5800 కోట్లు ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు.కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సహకారం లేకున్నా 35 వేల రైతు కుటుంబాలకు 17 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.