నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటా.. ఆయనే మా నాయకుడు.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానంటూ గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కాగా, ఇవాళ కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగించారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌తో పాటు పాల్గొన్న కొడాలి నాని అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ అవినీతిపై నిప్పులు చెరిగారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్నారు. ఏపీ రాష్ట్రం ప్రస్తుతం ఒక అవినీతి చక్రవర్తి పాలనను అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నాలుగు సంవత్సరాలపాటు ఏపీలో అవినీతి పాలనను కొనసాగించి.. తనపై ఎక్కడ ఏసీబీ, ఈడీ అధికారులు దాడులు చేస్తాయోనన్న భయంతో.. నాపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది అంటూ ప్రతీ బహిరంగ సభలో చెబుతూ.. ప్రజలను భమ్యపెడుతున్నారంటూ కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబుకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు.