ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల సమావేశం రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఈ రోజు తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా.. తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎంతో అఖిల ప్రియ, ఏవీల భేటీ రేపటికి వాయిదా పడింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆళ్లగడ్డ నియోజకవర్గంతో టీడీపీ సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది అఖిల ప్రియ అనుచరులే అని ఏవీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సింగపూర్ పర్యటనకు ముందు సీఎం చంద్రబాబు.. సుబ్బారెడ్డి, అఖిలప్రియతో మాట్లాడి కలసి పని చేయాలని సూచించారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు రావడంతో సీఎం సీరియస్ అయ్యారు. తనను కలవాలంటూ ఇద్దరికీ ఆదేశాలు కూడా జారీ చేశారు సీఎం చంద్రబాబు.
