ఏపీలో మరో టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుముశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కొసరాజు వెంకటాద్రిచౌదరి (డాక్టర్ బాబు (65)) తుదిశ్వాస విడిచారు. షుగర్ డౌన్ అయి విజయవాడలోని ఓ సూపర్‌స్పెషాల్టీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. వెంకటాద్రిచౌదరి మృత దేహాన్ని గుడ్లవల్లేరులోని కొసరాజు వెంకట రామకృష్ణారావు రైస్‌మిల్లుకు తీసుకొచ్చారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మోహనరావు, పార్టీ మండల ఇన్‌చార్జి ఎ. రామ్మోహనరావులు పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన స్వగృహానికి తరలిం చారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని స్వగృహంలో ఉంచారు. వెంకటాద్రిచౌదరి విద్యార్థి నాయకుడిగా కాకినాడ రంగారావు మెడికల్ కళాశాలలో మంచి గుర్తింపు పొందారు. మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ మిత్రుడు. తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరారు. మూడు దశాబ్దాల పాటు 15 సార్లుపైగా మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గుడివాడ ఏఎంసీ చైర్మన్‌గా పని చేశారు.
లయన్స్‌క్లబ్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన సొంత నిధులతో నిర్వహించారు. తండ్రి కొసరాజు వెంకట రామకృష్ణారావు పేరిట సోదరుడు బాపయ్యచౌదరితో కలసి ట్రస్ట్ ప్రారంభిం చారు.పెడన మండలం కప్పలదొడ్డిలోని నిరుపేద, చేనేత కార్మికులు 12 కుటుంబాలకు ప్రతినెలా నిత్యావసరాలు పంపుతున్నారు. కొసరాజు మృతదేహాన్ని ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సందర్శించారు.