తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వివరాలు పంచుకున్నారు. ఆపన్నులకు సహాయం అందించే వారి వివరాలను వెల్లడిస్తూనే….నలుగురికి సహాయం చేయాలనుకునే వారికి మార్గదర్శనం చూపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు లక్షా 20 వేల మందికి ఆపత్కాలంలో ఆపన్న హస్తం అందిందని మంత్రి కేటీఆర్ వివరించారు. రూ.800 కోట్లను సీఎంఆర్‌ఎఫ్ కింద గత 46 నెలల కాలంలో విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ అనేక మంది ఆపన్నులకు సహాయం అందించిన సంగతి తెలిసిందే. దీంతోపాటుగా ముఖ్యమంత్రి, మంత్రులు సైతం సహాయాలు అందిస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ఇప్పటివరకు ఎంతమందికి, ఎంత మొత్తం ఆర్థిక సహాయం అందించాలనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ…తాము ఏ విధంగా సహాయం చేయాలనే ప్రశ్నను మంత్రిని అడిగారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ట్విట్టర్‌లో ఈ వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించాలనుకునే వారు చెక్ రూపంలో తమ విరాళాన్ని అందించవచ్చని తెలిపారు. ‘ముఖ్యమంత్రి సహాయనిధి, తెలంగాణ ప్రభుత్వం’ పేరుతో తమ సహాయాన్ని చేయవచ్చని ఆయన వివరించారు.